భైరవకోన పార్వతీదేవి గుడి
(Bhairavakona Parvati Devi Temple)
అమ్మవారి దేవాలయం ఎక్కడ కొలువైనా అది భక్తులకు పరవశాన్ని ఇస్తుంది. దివ్యశక్తి శోభిస్తూ కళకళలాడుతుంది. ప్రకాశం జిల్లా కొత్తపల్లి దగ్గర్లోని పార్వతీదేవి ఆలయం కూడా అంతే. సరిగ్గా చెప్పాలంటే, పార్వతీదేవి దేవాలయం కొత్తపల్లికి దగ్గర్లో, భైరవకోన అడవుల్లో ఉంది. ఈ గుడి అడవుల్లో ఉండటాన ప్రతిరోజూ కాకుండా, ప్రతి శుక్రవారం అర్చిస్తారు. అలాగే, పండుగలు, పర్వదినాలు లాంటి విశేష దినాల్లో ఉత్సవాలు జరుపుతారు.
ప్రకాశం భైరవకోన పార్వతీదేవి ఆలయం కొత్త పాతల మేలు కలయిక అంటే బాగుంటుంది. ఎందుకంటే, ఈ గుడి ప్రాచీనమైనది కాదు, ఇటీవలి కాలంలో నిర్మించిందే. కానీ, ఆలలయంలో ప్రతిష్ఠించిన అమ్మవారి విగ్రహం మాత్రం ప్రాచీనమైంది. భైరవకోన అరణ్యంలో కొండలున్నాయి. ఆ కొండ గుహల్లో లభించిన పార్వతీదేవి శిల్పం ఈ గుడిలో స్థాపించడాన ఇది విశిష్టతను సంతరించుకుంది.
స్థల పురాణాన్ని అనుసరించి, ప్రకాశం భైరవకోన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తపల్లికి సమీపంలో ఉన్న అడవిలో కొండలు, కోనలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా! అందులో ఓ కొండ గుహలో భైరవ శిల్పం ఉంది. దానివల్లే ఈ కొనకు భైరవకోన అనే పేరు వచ్చిందట. మరో కథనాన్ని అనుసరించి, పూర్వం భైరవుడు అనే రుషి ఈ ప్రాంతంలో తపస్సు చేసుకునేవాడట. ఆ రుషి పేరు మీదనే వనానికి భైరవవనం అనే పేరు వచ్చింది అంటారు. భైరవ రుషి, తన తపశ్శక్తితోఒక వ్యక్తికి దివ్యశక్తిని ప్రసాదించి, ఆ కొండల్లో అనేక అద్భుత శిల్పాలను, గుహాలయాలను నిర్మింప చేశాడట. మహర్షి తపస్సు చేసిన ప్రాంతం గనుక ఈ పరిసరాలు పునీతమయ్యాయి.
అమ్మవారి దేవాలయంతో పవిత్ర స్థలంగా భావించే భైరవకోన చూడ చక్కని ప్రదేశం. ఇక్కడి గుహాలయాలు ప్రాచీన వైభవాన్ని చాటే కళా నిలయాలు. ఒక గుహలోని శివుని విగ్రహం వెనుక చెక్కిన పార్వతిని భక్తిశ్రద్ధలతో ఆరాచిన్చేవారట. ఒకసారి భైరవకోన గుహాలయాలను దర్శించడానికి వచ్చిన కంచి కామకోటి పీఠాధిపతి శివుని ప్రతిమ వెనుక కనిపిస్తున్న విగ్రహం అమ్మవారిది కాదని తేల్చి చెప్పారు. కనుక ఆ శిల్పాన్ని పార్వతీదేవిగా ఆరాధించడం సముచితం కాదని చెప్పారు. దాంతో ఆ ప్రాంతీయులు వెంటనే విరాళాలు సేకరించి, తమ ఆరాధ్యదైవమైన పార్వతీదేవికి ఒక ఆలయం నిర్మించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి