శుభ కార్యాల్లో పసుపు వస్త్రాలు ఎందుకు?
(Purpose of Yellow Clothes)
హిందువుల పూజాది కార్యక్రమాల్లో, పెళ్ళిళ్ళు ఇతర శుభ కార్యాల్లో పసుపు బట్టలకు చాలా ప్రాధాన్యత ఉంది. హోమం పూర్తయిన తర్వాత కృష్ణాజినపు ముక్క, మోదుగు చేతి కర్ర, మౌంజిలతో బాటు పీతవస్త్రం ధరించాల్సి ఉంటుంది. కానీ, ఎందుకు, ఏమిటి అనేది మాత్రం చాలామందికి తెలీదు. అసలు పీతవస్త్రం ఎందుకు ధరిస్తారో, పసుపు రంగులో ఉన్న గొప్పతనం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పసుపులో క్రిమి నాశక గుణం ఉంది. అందుకే మనం పసుపును ఏదో రూపంలో ఉపయోగిస్తుంటాం. గడపకు పసుపు రాయడంలో కళాత్మకత మాత్రమే పరమార్థం కాదు. చీమలు, ఇతర సూక్ష్మ క్రిములు ఇంట్లోకి రాకుండా ఉంటాయనే ఆలోచతో ఈ ఆచారం బయల్దేరింది. అలాగే కూరల్లో పసుపు వేయడంవల్ల ఆకర్షణీయమైన రంగు రావడమే కాకుండా ఆరోగ్యానికీ మంచిది. స్నానం చేసేముందు ముఖానికి, వంటికి పసుపు రాసుకుంటారు. ఇలా చేయడంవల్ల శరీర ఛాయ పెరుగుతుందని, అనేక రుగ్మతలు తగ్గుతాయని, చర్మ వ్యాధుల్లాంటివి రావని పెద్దలు చెప్తారు.
శ్రీచూర్ణం, కుంకుమల్లో కూడా పసుపు ఉంది. ముగ్గుల్లో పసుపు జల్లుతాం. ఆయుర్వేద వైద్యంలో పసుపును ఎక్కువగా ఉపయోగిస్తారు. తులసి మొక్కకు పసుపు రాస్తాం. హిందూ సంస్కృతిలో పసుపు వాడకం ఒక అలవాటుగా, ఆచారంగా ఉంది. దీన్ని మంగళప్రదమైన ద్రవ్యంగా వాడుతున్నాం.
పసుపు చర్మ వ్యాధులను నయం చేస్తుంది. అలాగే, చర్మ రోగాల కారణంగా వచ్చే ఇతర రుగ్మతలను కూడా తగ్గిస్తుంది. పరిణామశూల లాంటి ఇబ్బందికరమైన వ్యాధులను నయం చేస్తుంది. పైకి కనిపించే జబ్బులను, కనపడకుండా బాధ కలిగించే వ్యాధులను కూడా పసుపు నివారిస్తుంది.
పసుపురంగులో ఒక వింత ఆకర్షణ ఉంది. ఈ రంగు దుస్తులు ధరించడంవల్ల శరీర వర్చస్సు పెరుగుతుంది. దాతో పసుపు బట్టలు వేసుకున్నవారిపట్ల ఎదుటివికి ఒకవిధమైన సద్భావం కలుగుతుంది. పసుపు రంగు నరాలను కూడా ఉత్తేజపరుస్తుంది.
మానవ శరీరం పంచభూతాల సమ్మేళనం. అనుక్షణం నవగ్రహాల ప్రభావం మనమీద పడుతుంటుంది. పసుపురంగుకు పంచభూతాలు, నవగ్రహాలను అనుకూలంగా మార్చే శక్తి ఉంది. అందుకే మహర్షులు ప్రకృతిని మనకు అనుకూలంగా మార్చుకునేలా ఆచారాలను ప్రబోధించారు. తపస్వుల అనుభవ జ్ఞానంతో అంకురించినవే వివిధ ఆచారాలు. వాటిని మనం అనుసరిస్తున్నాం. ఇప్పుడిప్పుడు రంగుల చికిత్స లేదా కలర్ థెరపీ అమల్లోకి వస్తోంది. కానీ మన మహర్షులు ఈ జ్ఞానామృతాన్ని ఏనాడో బోధించారు.
పూర్వం విద్యార్థులు గురుకులానికి వెళ్ళి చదువుకునేవారు. అక్కడ అనేకమంది కలిసి ఉంటారు కనుక ఎవరికైనా వ్యాధులు ఉంటే, ఇతరులకు సోకే ఇబ్బంది ఉందని, పీత వస్త్ర ధారణ చేసేవారు. అలా విద్యాభ్యాసం చేసేంతకాలం పీత వస్త్రాలు మాత్రమే ధరించేవారు.
హిందూ సంప్రదాయాన్ని అనుసరించి, పెళ్ళిలో వధూవరులు పసుపుబట్టలు ధరిస్తారు. అలాగే పెళ్ళికూతురి తలపై పసుపు అద్దిన చట్రం ఉంచుతారు. వధువు అత్తగారిల్లు చేరేవరకూ ఆ చట్రం అలాగే ఉంటుంది. ఆంగ్లేయుల పరిపాలన మొదలైన తర్వాత వధూవరులు పసుపు బట్టలే ధరించాలి అనే నియమం సడలినప్పటికీ, తలంబ్రాలు పోసుకునే సమయంలో పసుపు అద్దిన వస్త్రాలనే ధరిస్తున్నారు. అలాగే, తలంబ్రాలు పడటంవల్ల కూడా అవి మరింత పచ్చగా తయారవుతాయి.
బాగా చెప్పారు.
రిప్లయితొలగించండిమీరు Plus button పెట్టండి మేము మా స్నేహితులకు పంచడానికి కుదురుతుంది.