గంధం సంతోషాన్ని ఇస్తుంది తెలుసా?
(Sandalwood)
హిందూ సంస్కృతిలో గంధానికి చాలా ప్రాధాన్యత ఉంది. మన పూజలు, పునస్కారాల్లో గంధాన్ని తప్పక వినియోగిస్తాం. అందరూ ఉపయోగిస్తున్నారు కనుక గంధాన్ని మనమూ వాడుతున్నామే కానీ, దానివల్ల ప్రయోజం ఏమిటో మనకు అంతగా అవగాహన ఉండదు. సర్వసాధారణంగా మన ప్రతి ఆచారం వెనుకా శాస్త్రీయ కారణం దాగి ఉంటుంది. అందుకే పెద్దలు వాటిని ఆచారాలుగా ప్రతిపాదించారు.
ఇప్పుడు పూజల్లో గంధం ఎందుకు ఉపయోగిస్తారో తెలుసుకుందాం.
అభిషేకం చేసిన తర్వాత దేవునికి వస్త్రం, యజ్ఞోపవీతం, అక్షతలతో బాటు గంధాన్ని సమర్పిస్తాం. వస్త్ర, యజ్ఞోపవీతాలను స్వయంగా సమర్పించక పోయినప్పటికీ, మంత్రపూర్వకంగా సమర్పించడం ఆచారంగా కొనసాగుతోంది.
గంధాన్ని మాత్రం నియమం తప్పకుండా ప్రతిరోజూ సమర్పించుకోవాలి. పూజ ముగిసిన తర్వాత గంధాన్ని మెడకు భక్తిగా రాసుకుని, అక్షతలను తలపై జల్లుకోవడం సంప్రదాయం.
గంధం ఎంత సువాసనాభారితంగా ఉంటుందో మనందరికీ తెలుసు. గంధపు చెట్ల పరిమళాలకు తాచుపాములు సైతం ఆకర్షితమై వస్తాయి. అందుకే గంధపు చెట్లు, పున్నాగ చెట్లు, మొగలి పొదల దగ్గర జాగ్రత్తగా ఉండమని పెద్దలు హెచ్చరిస్తారు. ఆ సంగతి అలా ఉంచితే, మంచి గంధపు సువాసన మాటలకు అందని సంతోషాన్ని ఇస్తుంది. అంతే కాకుండా దయాగుణాన్ని ప్రసాదిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి.
మనకు తెలిసి, తెలీకుండా మన మనసు ఎక్కడెక్కడో సంచరిస్తుంటుంది. ఆ చంచలత్వం నుండి తప్పించి, మనసును స్థిరంగా ఉంచుకోడానికే మనం పూజలు, ధ్యానాలు చేస్తాం. మనసులో చెలరేగే ఆలోచనలను నియంత్రించడానికి, కలతలు, కష్టాలూ ఏమైనా ఉంటే అరికట్టడానికి పూజలు దోహదపడతాయి. అందుకు గంధం తనదైన పాత్ర పోషిస్తూ సహకరిస్తుంది.
గంధంలో ఉండే దయ, సంస్కారం అనే మంచి వాసనలు, రాగద్వేషాలు అనే మలినాలను పోగొడతాయి. ఇతరత్రా మనలో పేరుకున్న కుసంస్కారాలను సైతం నశింపచేసి సంతోషం పాదుకునేలా చేస్తాయి. అలాగే, తోటివారి మీద ప్రేమ, దయ అంకురించేలా చేస్తాయి.
ఇంకొంచెం లోతుగా వెళ్తే పూర్వ కర్మల వాసనలను అంతమొందించి మళ్ళీ జన్మ ఉండకూడదు అని పూజించడానికి గంధం, అక్షతలు తోడ్పడతాయి.
గంధం మనసుకే కాదు, శరీరానికీ ఎంతో మేలు చేస్తుంది. అందుకే గంధాన్ని కేవలం పూజల్లోనే కాకుండా అనేక సందర్భాల్లో శరీరానికి రాసుకుంటాం.
గంధంతో శరీర ఛాయ పెరుగుతుంది.
గంధం సూక్ష్మక్రిములను నశింపచేస్తుంది.
గంధం వల్ల చర్మం పేలడం, పొక్కడం లాంటి ప్రతిచర్యలు చూపదు.
గంధంతో చర్మవ్యాధులెన్నో నివారణ అవుతాయి. స్కిన్ రాషెస్, స్కిన్ ఎలర్జీలే కాకుండా చర్మపై వచ్చిన మచ్చలు కూడా తగ్గుతాయి. దురదలు నివారింపబడతాయి.
పొరపాటున చర్మం ఏమైనా కాలితే, కొంచెం గంధం రాస్తే వెంటనే ప్రయోజనం ఉంటుంది.
గంధపుచెక్క లేదా గంధపు పొడిని పట్టు వస్త్రాల మధ్య ఉంచితే సువాసన రావడమే కాకుండా పాడవకుండా భద్రంగా ఉంటాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి