కార్తీకంలో పసందైన వనభోజనాలు
Vanabhojanam in Karthika Masam
కార్తీకమాసం అనగానే వనభోజనాల హడావిడి మొదలౌతుంది. ఊరూవాడా సందడిగా ఉంటుంది. వనభోజనాల ప్రసక్తి అనేక ధార్మిక గ్రంధాల్లో ఉంది. ముఖ్యంగా ''కార్తీకపురాణం''లో కార్తీక పౌర్ణమినాడు నైమిశారణ్యంలో మునులందరూ సూతమహర్షి ఆధ్వర్యంలో వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నట్లు లిఖితమైంది. ఉసిరిచెట్టు కింద కార్తీక దామోదరునిగా ప్రఖ్యాతుడైన శ్రీహరి ప్రతిమను ప్రతిష్ఠించి, ఉసిరికలతో హరిని పూజించి, గోవింద నామస్మరణ చేస్తూ షోడశోపచారాలతో పూజించి ఆనక వనభోజనాలు చేశారు.
అలా పూర్వం మహర్షులు ఆచరించిన కార్తీక వనభోజనాలు ఇప్పటికీ ఏర్పాటు చేసుకుంటున్నాం. నలుగురితో కలిసి ఆనందిస్తున్నాం. ఇంతకీ కార్తీక వనభోజనాలు ఎలా ఉండాలో ఒకసారి చూద్దాం.
కార్తీకమాసం అంటే వర్షాకాలం తర్వాత వస్తుంది. అంటే అప్పటిదాకా వానలు పడి చిత్తడిగా ఉన్న భూములు పొడివారతాయి. అటు వానలు, ఇటు ఎండలు లేకుండా వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాంటి వాతావరణంలో నాలుగ్గోడల మధ్య కాకుండా వనంలో అందునా ఔషధ ప్రాయమైన ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం ఆరోగ్యానికి మంచిది. వీలైనంతవరకూ వనభోజనాలు కార్తీక పౌర్ణమి లేదా కార్తీక సోమవారాల్లో ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. వృత్తి ఉద్యోగాలతో కొందరికి తీరుబాటు దొరకని మాటా నిజమే. అలా కార్తీక పౌర్ణమి, కార్తీక సోమవారాల్లో వీలు కుదరని పక్షంలో కార్తీకమాసంలో ఏదో ఒక రోజు పెట్టుకోవచ్చు.
వనభోజనం పేరుతో ఇంట్లో కాకుండా ఎక్కడో ఒకచోట భోజనం చేయడం అనుకుని కొందరు హోటల్సు, రిసార్ట్స్ రిజర్వ్ చేయించుకుంటున్నారు. అలా చేస్తే అది వనభోజనం అనిపించుకోదు. ఏదో మార్పు కోసం సరదాగా తినడం అవుతుంది. మన పెద్దలు ఉద్దేశించిన ప్రకారం కార్తీక వనభోజనానికి ఉసిరిచెట్టు ఉన్న తోట లేదా ఉద్యానవనాన్ని ఎంచుకోవాలి. అక్కడ ఉసిరిచెట్టు (A tree with acid fruit used for pickles. Phyllanthus Emblica; Emblic myrobalan ) కింద భోజనం చేయాలి. కార్తీక దామోదరుడు అని పిలుచుకునే శ్రీహరి విగ్రహం లేదా ప్రతిమను ఉసిరిచెట్టు కింద ఉంచి, పూజ చేసి, ఆనక వనభోజనాలు చేయాలి.
బంధువులు, స్నేహితులు, సహోద్యోగులు, ఇరుగుపొరుగువారు, ఒక ఊరివారు - ఇలా రకరకాలుగా కలిసి వనభోజనాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒక్కొక్కరూ ఒక్కో పదార్ధం తయారుచేసి తీసుకురావడం ఒక పద్ధతి కాగా, అందరూ తలా ఇంత అని డబ్బు చెల్లించి, కేటరింగ్ చెప్పడం మరో పద్ధతి. మొత్తానికి మామూలు కూరలు, పచ్చళ్ళతోబాటు గోంగూర పచ్చడి, ఉలవచారు, పులిహోర, బొబ్బట్లు, గారెలు, పూర్ణాలు లాంటి ప్రత్యేక వంటకాలతో ఆహా అనిపించే రుచికరమైన భోజనం చేయడం ఆనవాయితీ. వనభోజనానికి ముందు వెనుక రోజూవారి రొటీన్ కు భిన్నంగా అందరూ ఆటపాటలతో హాయిగా, ఆనందంగా గడుపుతారు.
మనదేశంలోనే కాకుండా ప్రవాసాంధ్రులు కూడా కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేసుకుని ఆనందిస్తున్నారు. కేవలం ఆంధ్రులే కాదు తమిళులు తదితర దక్షిణభారతీయులు వనభోజన మహోత్సవాలు జరుపుకుంటున్నారు.
కార్తీక వనభోజనాలు స్నేహాన్ని, సమైక్యతను పెంపొందిస్తాయి. పరస్పరం ఆహార పదార్థాలు పంచుకు తినడంవల్ల భిన్న రుచులు అనుభూతికి రావడమే కాకుండా నచ్చినవాటిని నేర్చుకోడానికి అవకాశం లభిస్తుంది. దైనందిన జీవితంలో ఎదురయ్యే చిరాకులు, పరాకులకు దూరంగా అందరూ కలిసి వేడుక చేసుకోవడం వల్ల వత్తిళ్ళు, వేదనలు తీరతాయి. వనభోజనాలను పెద్దల కంటే పిల్లలు మరీమరీ ఆనందిస్తారు.
Vanabhojanam in Karthika Masam, Karthika Vanabhojanam at acid fruits tree or Usiri chettu, Karthika Vanabhojanam Hindu ritual, Vanabhojanam sharing food and playing games
మూర్తిగారు బ్లాగుల్లో కూడా ఈరోజు కార్తీక వనభోజనాలు జరుగుతున్నాయండి. మీరు కూడా పాల్గొనండి. రాత్రి వరకు టైముంది.. వివరాలకు ఇక్కడ చూడండి..
రిప్లయితొలగించండిhttp://jyothivalaboju.blogspot.com/2011/11/blog-post_08.html
కార్తీక వనభోజనాల గురించి చక్కగా వివరించారండి . థాంక్ యు.
రిప్లయితొలగించండిచాలా బాగా చెప్పారండి. ఎన్నో విషయాలు తెలిసాయి కూడా.
రిప్లయితొలగించండి