లోకబాంధవుడు, గ్రహాలకు అధిపతి, ప్రత్యక్షనారాయణుడైన సూర్యభగవానుని జన్మతిథి మాఘశుద్ధ సప్తమి. దీనికే రథసప్తమి అని పేరు. రథసప్తమినాటి బ్రాహ్మీ ముహూర్తంలో ఆకాశంలోని తారకలన్నీ రథాకారం దాల్చి, సూర్యరథాన్ని తలపింప చేస్తాయని ప్రతీతి. ఈవేళ్టి నుంచి సూర్యునికి భూమి చేరువ కావడం ప్రారంభమవుతుంది. అంటే భానుడి కిరణాలు భూమికి పుష్కలంగా అందడం ఆరంభమవుతుంది. సర్వదేవమయుడైన ఆదిత్యుని ఆరాధించడం వల్ల తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి. అందుకు అనుకూలమైన రథసప్తమి ఈ నెల 10, గురువారం. ఈ సందర్భంగా ఈ వ్యాసం. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం
తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం
కశ్యప ప్రజాపతి, అదితి దంపతులకు విష్ణుమూర్తి అనుగ్రహంతో జన్మించినవాడే సూర్యుడు. ఈయన రవి, భాను, అర్క, భాస్కర, సవిత, వివస్వత, సర్వాత్మక, సహస్రకిరణ, పూష, గభస్తిమాన్, ఆదిత్యుడు అనే ఇతర నామాలతో కూడా ప్రసిద్ధుడు. ఛాయాదేవి, సంజ్ఞాదేవి ఈయన పత్నులు. శనీశ్వరుడు, యముడు, యమున మున్నగువారు వీరి సంతానం.
సూర్యభగవానుడు అన్ని జీవులపట్ల సమదృష్టి కలిగిన వాడు.
ఆరోగ్యప్రదాత. మహాశక్తిమంతుడు. సకల శాస్తప్రారంగతుడు. ఆంజనేయునికి గురువు. సువర్చలాదేవి ఈయన మానస పుత్రిక. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత ధనం వ్యయం చేసినా, విద్యాబుద్ధులు ఒంటబట్టక నిరాశలో ఉన్నవారు తమ జాతకం ప్రకారం సూర్యుని పూజించి, ఆయనను ప్రసన్నం చేసుకుంటే విద్యాభివృద్ధి కలుగుతుందని నవగ్రహపురాణం చెబుతోంది. సూర్యుడు లేనిదే చెట్లు, మొక్కలు మున్నగు వృక్షజాతులు మనలేవు.
నేత్రవ్యాధులు, శత్రుబాధలు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు శుచిగా ఉండి, నియమాలు పాఠిస్తూ, మండలం రోజులపాటు నిష్ఠగా ఆదిత్యహృదయాన్ని పారాయణ చేస్తే ఆయా బాధలు పటాపంచలవుతాయని ప్రతీతి.
రామరావణ సంగ్రామంలో రాముని బలం క్షీణించి, నిరాశానిస్పృహలలో కూరుకుపోయి ఉన్న సమయంలో... అగస్త్య మహర్షి శ్రీరామునికి వారి వంశ మూలపురుషుడైన సూర్యుని శక్తిని వివరించి, ఆదిత్యహృదయాన్ని ఉపదేశించాడు. ఆ దివ్యశ్లోకాలను పఠించిన శ్రీరాముడు నూతన శక్తిని పుంజుకుని యుద్ధంలో విజయం సాధించినట్లు రామాయణ మహాకావ్యం పేర్కొంటోంది. దీనిని బట్టి సూర్యారాధన ఎంతటి శ్రేష్ఠమైనదో తెలుస్తోంది.
రథసప్తమినాడు స్నానం చేసేటప్పుడు సూర్యభగవానుని మనసారా స్మరిస్తూ తలపై జిల్లేడు, రేగు, చిక్కుడు ఆకులు పెట్టుకుని స్నానం చేయాలని ధర్మశాస్త్రం చెబుతోంది. రథసప్తమి సూర్యగ్రహణంతో సమానమైనది. అందువల్ల గురువు నుంచి మంత్రదీక్ష తీసుకోవడానికి, నోములు పట్టడానికి అనుకూలమైన రోజు. ఉపదేశం ఉన్న మంత్రాలను జపం చేయడం సత్ఫలితాలను ప్రాప్తింప చేస్తుంది.
రథసప్తమినాడు సూర్యాష్టకం లేదా ఆదిత్యహృదయాన్ని 9 మార్లు పఠించి, ఆవుపేడ పిడకలను కాల్చిన నిప్పు సెగపై ఆవుపాలతో పరమాన్నం వండి, దానిని చిక్కుడు ఆకులలో ఉంచి నివేదించడం వల్ల సమస్త వ్యాధులు, శోకాలు నశించి, సుఖ సంపదలు చేకూరతాయని శాస్త్రోక్తి. జిల్లేడు, రేగు, దూర్వాలు, అక్షతలు, చందనం కలిపిన నీటిని లేదా పాలను రాగిపాత్రలో ఉంచి సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం వల్ల ఇహలోకంలో సకల సంపదలు, పరంలో మోక్షప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి, కోణార్క సూర్యదేవాలయం తదితర సూర్యక్షేత్రాలలో ఈవేళ విశేషపూజలు జరుగుతాయి. అంతేకాదు, తిరుమల శ్రీవేంకటేశ్వరుని ఆలయంలో రథసప్తమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు జరుపుతారు. కొందరికి ఈవేళ రథసప్తమీ వ్రతం చేయడం ఆనవాయితీ.
- డి.వి.ఆర్. భాస్కర్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి